దీపాల వరుస
దివ్వెల పండుగ లేదా దీవాలీ అని జరుపుకునే దీపావళి పదం సంస్కృతం నుంచి ఏర్పడింది. ఆ పదాన్ని విడదీస్తే, దీప+ఆవళి అంటే, దీపాల యొక్క వరుస అని అర్థం.
ఇంటి చుట్టూ వరసగా దీపాలు పేర్చటం, ఇంటి ముంగిట రంగవల్లులు తీర్చిదిద్ది అందగా దీపాలు అలకరించటం వెనుక ప్రధాన ఉద్దేశం: దీపం ‘తిమిర సంహారం,’ జ్ఞాన స్వరూపి. తిమిరం అంటే అజ్ఞానం, అంధకారం. మనలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్యోతిని వెలిగిస్తుంది దీపం. ఆ పరంజ్యోతికి సంకేతకంగా మనం దీపాలను వెలిగిస్తాం.

దీపావళి ఎందుకు జరుపుతారు?
దీపావళి ముఖ్యంగా చెడుపై మంచి సాధించిన విజయానికి సూచనగా జరుపుకుంటారు. ఈ పండుగ చేసుకోవడానికి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా –
- శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుణ్ణి వధించటం,
- వామనుడు బలిచక్రవర్తిని మూడడుగులు యాచించి, ఆ రాక్షసుని పాతాళానికి తొక్కటం
- రావణ వథానంతరం శ్రీరాముడు అయోధ్యకు చేరి భరతుని కలుసుకుని రాజ్యపట్టాభిషక్తుడవడం. భరతునితో జరిపే సమావేశాన్ని భరత్ మిలాప్ అని ఉత్తారాదివారు చెప్పుకుంటారు
- నరకము నుండి విముక్తి పొందడానికి యమునికి పూజచేయటం, చివరగా,
- విక్రమార్క చక్రవర్తి ఈ రోజున పట్టాభిషక్తుడవటంతోపాటు విక్రమార్కశకం ప్రారంభం కావటం.
చెడు అనే చీకటిని పారద్రోలి, మంచి అనే వెలుగు జగమంతా వ్యాపించిందని చెప్పడానికి దేశం నలుమూలాల ఉన్న వేలాది మంది నూనె దీపాలను, కొవ్వొత్తులను వెలిగించి తమ ఇళ్లను దేదీప్యమైన కాంతులతో నింపుతారు.
దీపావళి ఎప్పుడు జరుపుకుంటారు?
ఆశ్వీయుజ మాసం అంటే దసరా సమయంలో వచ్చే వానలు తగ్గుముఖం పట్టి, దీపావళినాటికి శరదృతువు మొదలవుతుంది. దీపావళి పండుగను నల్లటి చీకటి కమ్ముకునే కార్తీక అమావాస్య రోజు జరుపుకుంటారు.

ఐదురోజుల దీపావళి పండుగ
ఆచారవ్యవహారాలలో తేడాలున్నప్పటికీ, దీపావళి పండుగను ఆంధ్రానాట మూడు రోజులు మొదటిరోజు నరక చతుర్దశి, రెండవనాడు దీపావళి అమావాస్య, మూడో రోజు బలి పాడ్యమిగా జరుపుకుంటారు. అయితే ధన త్రయోదశి, భగనీ హస్తభోజనం (భాయిదూజ్)లతో కలిపి ఐదురోజులు ఈ పండుగను జరుపుకునే ఆనవాయితీని ఉత్తరదేశాన మనం చూడవచ్చు.
ధన త్రయోదశి: క్షీరసాగర మథనం నుండి ఉద్భవించిన శ్రీమహాలక్ష్మిని ఐశ్వర్యానికి అధిదేవతగా ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ప్రకటించి మహావిష్ణువు భార్యగా స్వీకరించాడు. అలాగే భృగుమహర్షిపైన ఆగ్రహంతో భూలోకానికి లక్ష్మీదేవి చేరిన ఈ ధనత్రయోదశినాడు లక్ష్మీదేవిని పూజిస్తారు. అంతేకాక ఔషదకర్త ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. అందుకే ధన త్రయోదశి ఆరోగ్యాన్ని, సంపదలను కలుగ చేస్తుందని నమ్ముతారు.
బలిపాడ్యమి: విష్ణువు వటువు రూపంలో బలిని పాతాళానికి తొక్కేస్తాడు. బలి పాతాళం నుంచి సంవత్సరానికి ఒక్కసారి ఈ పాడ్యమినాడు భూమ్మీదకు వస్తాడని పురాణ గాథ. అందుకే దీపావళి మర్నాడు బలిపాడ్యమిగా బలికి పూజలు చేస్తారు. శ్రీకృష్ణుడు ఈ పాడ్యమినాడే గోవర్ధనగిరి ఎత్తి రేపల్లీయులను ఇంద్రుని కోపాగ్ని బారి నుంచి కాపాడాడని మరో కథనం.
భగినీహస్తభోజనం లేదా భాయీదూజ్: తోబుట్టువుల ప్రేమకు నెలవుగా నిలిచే రాఖీ పౌర్ణమి గురించి అందరికి తెలుసు. అలాంటిదే భాయీదూజ్. ఈ పండుగ దక్షిణాది కంటే ఉత్తరాదిలో ప్రసిద్ధి. సూర్యభగవానుడి కూమారుడైన యముడు, కుమార్తె యమనకు సంబంధించిన పురాణ కథ ఈ పండుగకు మూలం. తన సోదరుని పట్ల ప్రేమతో ఎన్నిసార్లు భోజనానికి పిలిచినా రాని యముడు కార్తీక శుద్ద విదియనాడు తప్పకుండా వస్తానని తన సోదరికి ప్రమాణం చేస్తాడు. అన్నప్రకారం ఆ రోజు యమున ఇంటికి వెళ్లి ఆమె ఆతిథ్యం స్వీకరిస్తాడు. ప్రతీ సంవత్సరం ఇదేవిధంగా ఈ ఒక్కరోజు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోవల్సిందిగా యమున అన్నగారిని కోరుతుంది. నాటి నుంచి నేటి వరకు సోదరులు తమ సోదరీమణుల ఇళ్లకు కార్తీక శుద్ధ విదియనాడు వెళ్లి విందు ఆరగించటం ఆనవాయితీగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల వనవాసాంతరం అయోధ్య చేరిన రాముడు, భరతుడు కలుసుకున్న ఈ విదయను భాతృ విదియ లేదా భరత్ మిలాప్ అని కూడా పిలుస్తారు.
ప్రాంతాలవారి సాంప్రదాయాలు
కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా ఉత్తరాదిన దీపావళితో కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. అందుకే వ్యాపారాలు చేసేవారు లక్ష్మీపూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించి, నూతన కొనగొళ్లు చేయటం వంటివి చేస్తారు. మరికొన్ని ప్రాంతాలలో గౌరి, లక్ష్మీ, సరస్వతీల శక్తిత్రయపూజ నిర్వహిస్తారు.

· తెలుగునాట వ్యవసాయదారులు ‘కేదారములు’ అంటే పంటపొలాలు, ఆ పొలాలు సస్యశ్యామలంగా ఉండాలని ‘కేదారగౌరీ వత్రాము’ చేస్తారు. ఈ వత్రంలో భాగంగా తొమ్మిది రకాల పండ్లు, తొమ్మిది రకాలు పువ్వులు, తొమ్మిది రకాలు కూరగాయలు, ఆ ఋతువున పండే ధాన్యాలతో తొమ్మిది రకాల పిండివంటలతో పార్వతీ, పరమేశ్వరులను పూజిస్తుంటారు.
· గుజరాత్లో నేతి దీపాన్ని పెట్టి, రాత్రంతా దాన్నుంచి వచ్చే పొగను సేకరించి, దానితో కాటుక చేస్తారు.
· ఒడిశ్సాలో దీపావళిని పెద్దల దినంగా ఆచరిస్తారు. కౌరియా కాఠి / బడా బడువా డాకా పేర జనపనారతో చేసిన కర్రలను వెలిగించి పితృదేవతలను ఆరాధిస్తారు. మణిపూర్లో కూడా దీపావళి రోజు పితృదేవతల కోసం దీపాలు వెలిగించే సాంప్రదాయం ఉంది.
· బెంగాల్ లో లక్ష్మీ, గణేశుడు, కాళీమాతలను పూజిస్తారు.
· మహారాష్ట్రలో దీపావళి సందర్భంగా ‘వాసు బరాస్’ పేర గోపూజ నిర్వహిస్తారు. గోవర్ధనగిరిని తలుచుకుంటూ ఆహారాన్ని పర్వతం రూపంలో ‘అన్న కూట్’ పేర్చి నైవేద్యం పెడతారు. కుబేరుడిని, లక్ష్మీదేవిని పూజిస్తారు.
· కేరళలో అమావాస్య రోజున బలిచక్రవర్తి మరణించాడని దీపావళి పండుగను ఆర్భాటంగా జరుపుకోరు.
· ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ‘దేవ్ దీపావళి’ జరుపుతారు. దీపావళి రోజున ప్రత్యేక గంగ హారతినివ్వడంతోపాటు, గంగానది ఒడ్డున ఘాట్లపై లక్షల దీపాలు వెలిగిస్తారు.

వివిధ మాతాల్లో దీపావళి:
ప్రాచీన కాలం నుంచి మన సంస్కృతిలో ఒక భాగమైన దీపావళి పండుగను అనేక పేర్లతో పిలుస్తారు. ముద్రారాక్షసం అనే గ్రంథంలో కౌముదీ మహోత్సవంగా పిలవబడే దీపావళిని జైనులు దీప ప్రతిపదుత్సవంగా జరుపుకుంటారు. మహావీరుడు ఈ అమావాస్యనాడు నిర్యాణం చెందాడు. ఆనాడు దేవతలు ఆయనను పూజించి నగరమంతా దీపాలు వెలిగించారని, జైన హరివంశంలో చెప్పబడింది. చతుర్దశిని మహావీరుని నిర్యాణలక్ష్మి దినంగా, అమావాస్యను మహావీరుని శిష్యుడు ఇంద్రభూతి-జ్ఞానలక్ష్మి’ సంక్రమించిన దినంగా పండుగ జరుపుకుంటారు.
బౌద్ధ జాతక కథలలో లక్షదీపోత్సవము, దీపదానము జరిపి బుద్ధభగవానుని చుట్టూ దీపాలు పెట్టి పూజించినట్టుగా చెపుతుంటారు. సింహాసన ద్వాత్రింశతిలో దీనిని దివ్వెల పండుగగా చెప్పబడింది.
సిక్కు మతస్థులు సిక్కుల ఆరవ గురవైన గురు హరగోబింద్ సింగ్ మొగలాయీ చక్రవర్తి జహంగీర్ ఖైదు నుంచి విడుదలైన రోజుగా దీపావళిని జరుపుకుంటారు. ఈ పండుగను వారు బండి ఛోర్ దివస్ అని పిలుస్తారు. వీధుల్లో సిక్కుల పవిత్ర గ్రంథమైన 'గురు గ్రంథ్ సాహిబ్'తో నగర్ కీర్తన్ పేర ఊరేగింపులు నిర్వహిస్తారు.
ముస్లీం మతస్థులు దీపావళి అని పిలవకపోయినా, మహమ్మద్ పైగంబర్ మక్కాకు తిరిగి వెళ్లిన రాత్రికి సూచనగా దీపోత్సవం జరుపుతారు. బాణాసంచా కాలుస్తారు. దీనినే ‘షబే బరాత్’ అంటారు.
వివిధ దేశాల్లో దీపావళి
భారతదేశంలోనేకాక, నేపాల్ దేశంలో దీపావళి పండుగను ‘తిహార్’ అని పిలుస్తారు. కుక్క పూజ, గోపూజ, గోవర్థనగిరి పూజ, లక్ష్మీ పూజ, భాయ్ టికా అని వేడుకలు నిర్వహిస్తారు. అలాగే ‘మ్హ పూజ’ పేర తమని తాము అంటే శరీర-ఆత్మపూజను చేసుకుంటారు. దీనిని లక్ష్మీపూజ తర్వాత రోజు జరుపుతారు.

శ్రీలంకలో రామాయణ సాంప్రదాయాన్నిఅనుసరించి దీపావళి పండుగ జరుపుకుంటారు. అలాగే, మలేషియా, సింగపూర్, మారిషస్, ఫిజీ, ట్రినిడాడ్ వంటి దేశాల్లో కూడా దీపావళి వేడుకలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇండోనేషియాలో లక్ష్మీ పూజ కంటే ఆత్మ శుద్ధి, దేవాలయ దీపాలు, పితృ పూజ మీద ఎక్కువ దృష్టి పెడతారు.
Learn more about Diwali, Deepavali, Bandi Chhor Diwas and Tihar here.
ఆస్ట్రేలియాలో దీపావళి వేడుకలు
ఆస్ట్రేలియాలో చిన్నా, పెద్ద, పార్టీలకి అతీతంగా రాజకీయ, పుర ప్రముఖులు దీపావళి వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు అందచేస్తారు. ఆస్ట్రేలియాలోని ప్రముఖ స్థలాలైన పార్లమెంట్ హౌస్, సిడ్నీ ఒపేరా హౌస్ వంటి కట్టడాలను దీపాలతో అలంకరిస్తారు.

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులందరూ తమ కుటుంబాలతో, స్నేహితులతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. దేవాలయాలకు వెళ్లటంతోపాటు, మిఠాయిలు పంచుకుని ఆనందాన్నివ్యక్తపరుస్తారు.
ఎస్బీఎస్ తో సహా పలు సంస్థలు దక్షిణ ఆసియా ప్రజల సాంప్రదాయాలను అక్కున చేర్చుకుని వారి పండుగలో పాలుపంచుకుంటున్నాయి.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో దీపావళి రోజున అధికారికంగా సెలవును ప్రకటించినట్టుగానే, ఆస్ట్రేలియాలో కూడా దీపావళిని సెలవుగా ప్రకటించాలని పలు సంస్థలు కోరుతున్నాయి.
దీపావళి వేడుకలు
ప్రవాస భారతీయులు పాలతో చేసిన తీపిపదార్ధాలను, మిఠాయిలను ఇరుగు, పోరుగువారితో పంచుకుని తమ తోటివారితో స్నేహ, సౌభ్రాతృత్వం పెంచుకోవడం దీపావళి సందర్భంగా కన్పిస్తుంది. ఇంటి ముంగిట రంగు, రంగుల ముగ్గులు వేస్తారు. వాకిటి తలుపులను, కిటికీలను తెరిచి సిరిసంపదలను అందించే లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు.
దీపావళి అనగానే బంగారం కొనుగోలు చేయడం మనవారి అలవాటు. ముఖ్యంగా ధనత్రయోదశి రోజున బంగారు ఆభరణాల, వెండి సామగ్రి విక్రయం భారతదేశంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక దీపావళి సందర్భంగా స్వీట్స్ తోపాటు బహుమతులను ఇచ్చుపుచ్చుకోవడం, ఉద్యోగులకు బోనస్ ప్రకటించడం మన ఆనవాయితీ.
యునెస్కొ దీపావళిని తమ సాంస్కృతిక వారసత్వ జాబితాలో అధికారికంగా చేర్చి, పండగ విశిష్టతను భారతీయ ఆచారాలకు గుర్తింపు కల్గించింది.


ఎస్బీఎస్ లో దీపావళి
ప్రతి సంవత్సరం హిందీ, నేపాళీ, తమిళం, తెలుగు, పంజాబీ, గుజరాతీ మరియు బెంగాలీ భాషా ప్రసారాల ద్వారా ఎస్బీఎస్ దీపావళి వేడుకులను ప్రవాస భారతీయుల ముంగిటకు తీసుకువస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతీ భాషకు సంబంధించిన వారు తమ, తమ సమాజాలతో చేసుకునే దీపావళి వేడుకల ప్రత్యేక కార్యక్రమాలను ఎస్బీఎస్ ప్రసారం చేస్తోంది.

పండుగ విశిష్టత, సాంప్రదాయాలు, ఆచారాలు, పిండివంటలకు సంబంధించిన ప్రత్యేక కథనాలను రూపొందిస్తుంది. ఎస్బీఎస్ ఆన్ డిమాండ్ ఛానల్ ద్వారా వినోద కార్యక్రమాలను, సినిమాలను, టెలివిజన్ కార్యక్రమాలను పండుగ రోజులలో ప్రసారం చేస్తుంది.
ఎస్బీఎస్ కార్యాలయాన్ని కూడా దీపావళి పండుగకు అనుగుణంగా అలంకరించి, పండుగ వాతావరణాన్ని కల్పించి, సిబ్బంది అందరూ వేడుకలు జరుపుకుంటారు.
Find how SBS languages cover Diwali here
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

