భారతీయ సంస్కృతిలో, ఆథ్యాత్మిక చింతనలో భాగమైన యోగా విశిష్టతను నేడు యావత్తు ప్రపంచం గుర్తించి, ఆచరిస్తోంది. అంతేకాకుండా, ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటోంది. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన సందర్భంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఆలోచనను ప్రతిపాదించారు. దానికి ప్రపంచంలోని 175 దేశాలు మద్దతు పలకటంతో ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ అన్న నినాదంతో మొట్టమొదటిసారిగా 2015 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
జూన్ 21నాడు ఉత్తరార్థ గోళంలో (అంటే నార్తరన్ హెమిస్పియర్ లో) పగటి సమయం ఎక్కువ. సూర్యునితో అనుసంధానమైన యోగాను ఆ ప్రత్యేక దినాన జరుపుకోవాలన్న మోదీ సూచనను ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. న్యూఢిల్లీలో జరిపిన మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 84 దేశాల నుంచి ఆయా దేశాల నేతలు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. మొత్తం 35, 985మంది సమిష్టిగా యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేసి గిన్నీసు రికార్డు నెలకొల్పారు.
చాలామంది మనలో అనేకానేక వ్యాయామాలు చేస్తారు. అయితే ఈ వ్యాయామాలన్ని శరీరధారుఢ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తాయి కానీ, ఆరోగ్యాన్ని వృద్ధి చేయవు. ఆసనాలు కొన్ని నిలబడి, కొన్ని కూర్చుని, మరికొన్ని పడుకుని చేయటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరము నూతనోత్సాహాన్ని పొందుతుంది. మనకి స్ఫూర్తిని, శరీరానికి ఉత్తేజాన్ని కల్గించే ఈ యోగా యొక్క ప్రాధాన్యతను, చేసే విధానం మరియు ఆహార నియమాలు వంటి పలు ప్రశ్నలను ఈ శీర్షికలో చర్చించడం జరిగింది .
హైద్రాబాదుకు చెందిన శ్రీమతి గండేపల్లి సుశీలగారు 43 ఏళ్లగా యోగా సాధన చేయటంతోపాటు ప్రకృతివైద్యంలో కూడా శిక్షణ పొందారు. అలానే ఇషా యోగా సెంటర్ లో వాలంటీర్ గా పనిచేస్తున్న రాంకీగారు 12 ఏళ్లగా యోగ సాధన చేస్తున్నారు. ఆస్ట్రేలియా అంతటా పలు ఉచిత తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. యోగ గొప్పదనాన్ని తెలుసుకొని తప్పకుండా మన దైనందన జీవితంలో ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. IT లో పనిచేస్తున్న సరస్వతి మాట్లాడుతూ, పెరుగుతన్న వత్తిళ్లకు యోగా మానసికంగా దృఢంగా ఉండేందుకు ఎంత సహాయపడిందో తెలియజేస్తున్నారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.